bangalore: భారత్ కు చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు
- బెంగళూరుకు చేరుకున్న యుద్ధ విమానాలు
- ఈ నెల 20న బెంగళూరులో ఏరో ఇండియా షో
- ఈ షో ద్వారా కనువిందు చేయనున్న యుద్ధ విమానాలు
ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు ఆరోపణల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే రాఫెల్ యుద్ద విమానాలు రెండు ఈరోజు సాయంత్రం భారత్ కు చేరుకున్నాయి. ఈ నెల 20న బెంగళూరులో జరగబోయే ఏరో ఇండియా షో లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా, బైన్నియల్ ఎయిర్ షో, ఏవియేషన్ ఎగ్జిబిషన్ పాల్గొనేందుకు మరో రాఫెల్ యుద్ధ విమానం కూడా రానుంది. ఈ యుద్ధ విమానాలను భారత వాయుసేనకు చెందిన నిపుణులైన పైలట్స్ నడపనున్నారు.
కాగా, ఫిబ్రవరి 20 నుంచి జరిగే ఏరో ఇండియా షోలో విమానాలను సందర్శకులు వీక్షించేందుకు టిక్కెట్ ధరలను నిర్ణయించారు. బిజినెస్ డేస్ లో ఒక్కో టిక్కెట్ ధర రూ. 2750 కాగా, మిగిలిన రోజుల్లో టిక్కెట్ ధర రూ.1800గా ఉంది. ఎయిర్ డిస్ ప్లే కోసం రూ.600 చార్జి వసూలు చేస్తారు, అక్కడికక్కడే టిక్కెట్లు కొనుగోలు చేయాలంటే మాత్రం రూ.250 అదనంగా చెల్లించాలి.