Andhra Pradesh: నేను వచ్చి వెళితే మా వాళ్లను వేధించడం ఏమిటి?: విజయవాడలో టీఆర్ఎస్ నేత తలసాని నిప్పులు
- ఈ ఉదయం విజయవాడకు వచ్చిన తలసాని
- ఏపీలో పాలన ఆశాజనకంగా లేదు
- దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి వెళితే, యాదవ సంఘాల నాయకులను, తన వారిని వేధించడం ఏంటని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. నేడు మరోసారి విజయవాడకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన ఆయన, ఆ రిజర్వేషన్లకు రాష్ట్రంతో సంబంధం లేదని అన్నారు.
ఏపీలో ప్రభుత్వం ఆశాజనకంగా లేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా, ఇక్కడి పాలకుల్లా దిగజారుడు రాజకీయాలను తామెన్నడూ చేయలేదని చెప్పారు. మాట్లాడితే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని, ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని విమర్శించారు. తెలంగాణలో తాము 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామని, ఏపీలో మాటలు చెబుతున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న డబ్బులన్నీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకేనని, ఎన్నికల తరువాత చేతులెత్తేస్తారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తలసాని వ్యాఖ్యానించారు.