Andhra Pradesh: జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్.. రాకేశ్ రెడ్డి ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వలేదట!
- బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు రాకేశ్ రెడ్డి
- జయరాంను చంపేసి నకిలీ డాక్యుమెంట్ల రూపకల్పన
- సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం తనకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వకపోవడంతో కొట్టాననీ, దీంతో ఆయన చనిపోయాడని రాకేశ్ రెడ్డి ఇంతకుముందు పోలీసులకు చెప్పాడు. తాజాగా అధికారుల విచారణలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి రాకేశ్ రెడ్డికి జయరాం రూపాయి కూడా అప్పు లేడని విచారణలో తేలింది.
జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు ఆయన్ను ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు. జయరాంను చంపేసిన అనంతరం హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించి అప్పు ఇచ్చినట్లు దొంగ పత్రాలు సృష్టించాడని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే చింతల్ కు చెందిన ఓ రౌడీ షీటర్ ను అరెస్ట్ చేశామన్నారు.