mayavati: ఇలా చేస్తే ఇక బీజేపీకి, కాంగ్రెస్ కు తేడా ఏముంటుంది?: మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై మాయావతి ఫైర్
- మధ్యప్రదేశ్ లో గోవులను చంపిన వారిపై ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు
- యూపీలో ఇదే చట్టాన్ని ప్రయోగించిన యోగి సర్కార్
- ఈ రెండు పార్టీలకు తేడా ఏముందని ప్రశ్నించిన మాయావతి
మధ్యప్రదేశ్ లో ఆవును చంపిన ఘటనలో ముగ్గురు వ్యక్తులపై జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య తేడా ఏముందని ఆమె ప్రశ్నించారు. గోవులను చంపుతున్న ముస్లింలపై బీజేపీ జాతీయ భద్రత చట్టాన్ని ప్రయోగిస్తోందని... ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పని చేసిందని విమర్శించారు. అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో చదువుతున్న 14 మంది విద్యార్థులపై (వీరంతా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు) యూపీ ప్రభుత్వం దేశద్రోహ ఆరోపణలతో కేసులు పెట్టిందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య తేడా ఏముందో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.