India: కేంద్ర ఆర్థిక మంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ!
- అమెరికాలో కేన్సర్ కు చికిత్స
- ఇటీవలే భారత్ కు రాక
- ఈరోజు కేబినెట్ కమిటీ భేటీలో పాల్గొన్న నేత
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తిరిగి చేపట్టారు. ఇటీవల అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకున్న అరుణ్ జైట్లీ కొన్నిరోజుల క్రితం భారత్ కు తిరిగివచ్చారు. ఆయన అమెరికాకు వెళ్లడంతో మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
ప్రధాని మోదీ సూచన మేరకు రాష్ట్రపతి కోవింద్ అరుణ్ జైట్లీకి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖను అప్పగించారు. ఈ విషయమై అరుణ్ జైట్లీ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఆర్థికమంత్రిగా శుక్రవారం నుంచి బాధ్యతలు చేపట్టాను. ఇన్ని రోజులు ఆర్థికశాఖ వ్యవహారాల్ని చక్కదిద్దిన పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు. ఆయన శ్రద్ధతో, సమర్థవంతంగా పనులన్నీ చక్కదిద్దారు’ అని ప్రశంసించారు.
తొడ భాగంలో కేన్సర్ సోకడంతో జైట్లీ అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అనంతరం గత వారం భారత్ కు తిరిగివచ్చారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ సోషల్ మీడియా ద్వారా దేశంలో జరుగుతున్న వ్యవహారాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలోనూ జైట్లీ పాల్గొన్నారు.