Karnataka: నా భర్తను ఎలా చంపారో వాళ్లను కూడా అలాగే చంపండి!: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న వీర జవాను భార్య
- మృతవీరుల కుటుంబాల్లో ఆగ్రహజ్వాలలు
- దెబ్బకు దెబ్బకు తీయాలంటూ పిలుపు
- దేశ రక్షకులకే రక్షణ లేదంటూ ఆవేదన
జమ్మూకశ్మీర్ లో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఆత్మాహుతి దాడిపై ప్రకంపనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. దెబ్బకు దెబ్బ తీసే విషయంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సీఆర్పీఎఫ్ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో భారత సాయుధ బలగాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్న దానిపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, పుల్వామా దాడిలో మరణించిన ఓ సీఆర్పీఎఫ్ జవాను భార్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన హెచ్. గురు సీఆర్పీఎఫ్ లో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో గురు కూడా ఉన్నాడు. తన భర్త వీరమరణం పొందడంపై గురు భార్య కళావతి తీవ్రంగా స్పందించింది. తన భర్తను ఎలా పొట్టనబెట్టుకున్నారో ఆ కిరాతకులను కూడా అదే రీతిలో చంపాలని పిలుపునిచ్చింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
"నిన్న నా భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ పని ఒత్తిడి కారణంగా ఆ కాల్ మాట్లాడలేకపోయాను. మళ్లీ నేను కాల్ చేస్తే అవుటాఫ్ రీచ్ అని వచ్చింది. నా భర్తతో మాట్లాడ్డానికి వచ్చిన ఆ చివరి అవకాశం అలా మంటగలిసిపోయింది... అంతా మా తలరాత" అంటూ కన్నీటి పర్యంతమైంది కళావతి.
తన భర్త మరణించిన విషయం గురువారం రాత్రి 11 గంటల సమయంలో తెలిసిందని వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సీఆర్పీఎఫ్ జవాన్ల దయనీయ పరిస్థితికి నిదర్శనం అని చెప్పాలి. దేశాన్ని కాపాడే జవాన్లకే రక్షణ లేకపోతే వాళ్లను ఇళ్లకు పంపించేయండి.. కనీసం వాళ్ల కుటుంబాల కోసమైనా పాటుపడతారు... అంటూ డిమాండ్ చేసింది కళావతి.
నా భర్త దేశాన్ని రక్షించాడు, కానీ విపత్కర పరిస్థితుల్లో తనను ఎవరూ రక్షించలేకపోయారు... అంటూ తీవ్ర ఆవేదన నిండిన స్వరంతో వ్యాఖ్యానించింది. కాగా, ఉగ్రదాడిలో అసువులు బాసిన హెచ్. గురు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.