USA: అమెరికాలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు ట్రంప్!
- అమెరికా-మెక్సికో గోడ నిర్మాణంపై చర్యలు
- కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన ట్రంప్
- కోర్టులో అడ్డుకునేందుకు డెమొక్రాట్ల ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినదాన్ని చేసి చూపారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి తనకు నిధులు కేటాయించకుంటే ఎమర్జెన్సీ విధిస్తానని ప్రకటించిన ట్రంప్.. చెప్పినట్లుగానే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికాలోకి డ్రగ్స్ తో పాటు అక్రమ వలసదారులను నియంత్రించేందుకు ట్రంప్ దాదాపు రూ.40, 660 కోట్ల నిధులతో 3,200 కిలోమీటర్ల పొడవైన గోడను కట్టాలని ప్రతిపాదించారు. అయితే ఇందుకు అంగీకరించని కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) కేవలం రూ.9,273 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ట్రంప్.. తాజాగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా సరిహద్దు గోడ నిర్మాణానికి ట్రంప్ ఆదేశాలు జారీచేయడం వీలవుతుంది. దీనివల్ల గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే దీన్ని కోర్టులో సవాల్ చేసేందుకు ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మిలటరీ, డ్రగ్స్ నియంత్రణ కోసం వాడుతున్న నిధులను ఈ గోడ నిర్మాణానికి మళ్లించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరో షట్డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరుసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. ఈ విషయమై ట్రంప్ స్పందిస్తూ.. గోడ నిర్మాణానికి ఇప్పుడు ఆటంకాలు ఎదురైనా అంతిమ విజయం తమదే అవుతుందని స్పష్టం చేశారు.