Kamal Haasan: కులం, మతం లేని అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పిన కమలహాసన్

  • స్నేహ పార్తీబరాజా సంచలనం
  • కులం, మతంలేని మొట్టమొదటి భారతీయురాలిగా గుర్తింపు
  • అన్ని వర్గాల నుంచి అభినందనలు

గత కొన్ని రోజులుగా మీడియాలో స్నేహ పార్తీబరాజా అనే తమిళమ్మాయి పేరు బాగా వినిపిస్తోంది. ఇప్పుడీ అమ్మాయిని విలక్షణ నటుడు కమలహాసన్ కూడా అభినందించారు. కమల్ అంతటివాడు అభినందించాడంటే అందుకు బలమైన కారణమే ఉంటుంది. స్నేహ పార్తీబరాజా దేశంలో కులం, మతం లేని మొట్టమొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఈ మేరకు అధికారులకు ఆమెకు ప్రత్యేకమైన సర్టిఫికెట్ కూడా జారీచేశారు.

ఈ విషయం తెలిసిన కమల్ ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 'ప్రియమైన స్నేహా... భారతీయుల్లో చాలామందికి ఉన్న కోరికను మీరు నెరవేర్చుకున్నారు' అంటూ శుభాభినందనలు తెలిపారు. 'మతాన్ని నెట్టేద్దాం, కులాన్ని తోసేద్దాం... ఇక నుంచి మెరుగైన శుభోదయాన్ని ఆస్వాదిద్దాం... మంచి పని చేశావమ్మా' అంటూ ట్వీట్ చేశారు కమల్.

మనకు తెలిసినంతవరకు ఎవరికైనా కులం, మతం తప్పనిసరి. కొన్ని ధ్రువీకరణ పత్రాల్లో కులం, మతం వివరాలు తప్పకుండా పొందుపరచాల్సి ఉంటుంది. అయితే తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన స్నేహ బాల్యం నుంచి ఏ దశలోనూ తన కులం, మతం గురించి ఎక్కడా పేర్కొనలేదు. స్కూల్, కాలేజి.. .ఇలా ఎక్కడా ఏ సర్టిఫికెట్ లోనైనా కులం, మతం కాలమ్స్ ఖాళీగా వదిలేసేది. ఆమె తల్లిదండ్రులు సైతం కుల, మతాలకు వ్యతిరేకంగా ఉండేవారు.

2018లో ఆమెకు పార్తీబరాజాతో పెళ్లయింది. అయితే చాలాకాలంగా ఆమె తనకు ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వంతో పోరాడుతోంది. వృత్తి రీత్యా లాయర్ అయిన స్నేహ తాను ఏ కులానికి, మతానికి చెందిన దాన్ని కాదంటూ ఎంతో పకడ్బందీగా అర్జీ పెట్టుకుంది. ఎన్నో ప్రయత్నాల మీదట ప్రభుత్వం ఆమెకు స్పెషల్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇప్పుడామె దేశంలోనే కులం, మతం లేని మొట్టమొదటి మహిళగా అధికారికంగా అవతరించింది.

  • Loading...

More Telugu News