Chandrababu: ముందు చెప్పినట్టే.. రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేసిన చంద్రబాబు సర్కార్
- ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- తొలి విడత వెయ్యి రూపాయలు జమ
- రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు లబ్ధి
రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.9 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు అదనం. ఐదు ఎకరాలకు పైన వున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘అన్నదాత సుఖీభవ’ కింద తొలి విడత సొమ్మును సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్టుగానే తొలి విడత వెయ్యి రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసింది. 48,89,277 మంది రైతుల ఖాతాల్లో రూ. 1000 చొప్పున మొత్తం రూ. 488.92 కోట్లు జమచేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాత సుఖీభవ పథకం వల్ల రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి విడతగా ఇచ్చే రూ.4 వేలలో మిగిలిన రూ. 3 వేలను మార్చి మొదటి వారంలో బదిలీ చేస్తారు.