Chandrababu: వైసీపీలో చేరికల వెనుక కేసీఆర్ హస్తం: చంద్రబాబు సంచలన ఆరోపణ!
- రాష్ట్రంపై కుట్రలు చేస్తున్న కేసీఆర్
- ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
- టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆరోపణ
తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన విమర్శలు చేశారు. ఈ ఉదయం అమరావతి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, జగన్ తో కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన లక్ష్యమని నిప్పులు చెరిగారు.
దేశ భద్రత విషయంలో టీడీపీ రాజీపడబోదని వెల్లడించిన ఆయన, రాజకీయ లాభం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మోదీ ఏ అరాచకం చేయడానికైనా సమర్ధుడేనని, గోద్రాలో ఆయన హయాంలో సాగిన నరమేధంలో 2 వేల మంది మరణించిన విషయాన్ని తాను ఎన్నడూ మరువబోనని అన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అస్థిరంగా ఉండటం వృద్ధి విఘాతమని వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీజేపీ రాజకీయాల కారణంగానే జమ్ము కాశ్మీర్ లో సంక్షోభం ఏర్పడిందన్నారు.
'అన్నదాత సుఖీభవ' పథకాన్ని రైతులంతా స్వాగతిస్తున్నారని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 1000 జమ చేశామని చంద్రబాబు చెప్పారు. పేదల సంక్షేమ పథకాల విషయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందని, వీటిని చూసి జగన్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని, ఏం మాట్లాడుతున్నానన్న విషయం కూడా ఆయనకు తెలియడం లేదని అన్నారు. ఏపీలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారితో జగన్ చేతులు కలిపారని, ఈ కుట్రదారులకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.