lk advani: రాజకీయ యోధుడి శకం ముగిసింది.. రాజకీయాలకు స్వస్తి పలుకుతున్న అద్వాని?
- గాంధీనగర్ నుంచి మరోసారి పోటీ చేయాలని కోరిన అమిత్ షా
- కనీసం కుమారుడు లేదా కూతురుని బరిలోకి దింపాలని విన్నపం
- కుదరదని తేల్చి చెప్పిన అద్వాని
భారత రాజకీయాలలో ఆయనొక శక్తి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంలో ఆయన కృషి కూడా ఎంతో వుంది. దివంగత ప్రధాని వాజ్ పేయికి కుడి భుజంగా ఉంటూ... పార్టీని అధికారం వైపు నడిపిన ధీశాలి. ఆయనే బీజేపీ కురువృద్ధుడు అద్వాని. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తేల్చి చెప్పారు.
మరోసారి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని అద్వానిని అమిత్ షా కోరారు. అయితే, పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం. కనీసం అద్వాని సంతానమైన జయంత్, ప్రతిభలలో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలని... వారిని గెలిపించుకునే బాధ్యతను తాము తీసుకుంటామని అమిత్ షా కోరినప్పటికీ, దానికి కూడా అద్వాని నిరాకరించారట. ఇదే నిజమైతే... దేశ రాజకీయ చరిత్రలో మరో అంకం ముగిసినట్టే!