jayachithra: ఆ రోజున రాజీవ్ గాంధీ గారితో నేను కూడా శ్రీపెరంబుదూర్ వెళ్లవలసి వుంది: సీనియర్ నటి జయచిత్ర
- రాజీవ్ గాంధీ గారిని ఎయిర్ పోర్ట్ లో కలిశాను
- నా సినిమాను తప్పకుండా చూస్తానన్నారు
- ఆ వార్తను నేను నమ్మలేకపోయాను
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న జయచిత్ర, తన జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటనను గురించి ఇలా చెప్పుకొచ్చారు. "అప్పట్లో నేను చెన్నైలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటూ వుండే దానిని. ఆ సమయంలోనే నేను ఒక తమిళ సినిమాకి దర్శకత్వం కూడా చేశాను. ఆ సినిమాను రాజీవ్ గాంధీ గారికి చూపించాలని అనుకున్నాను.
ఆయనతో పాటు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడి వేదికపై ఆయనకి శాలువ కప్పి ఒక మెమొంటో ఇవ్వాలని అనుకున్నాను. అదే సమయంలో చెన్నైలోని ఒక అమ్మవారి టెంపుల్ నుంచి ఒకావిడ వచ్చి .. శ్రీపెరంబుదూర్ వెళ్లకుండా రాజీవ్ గాంధీగారికి ఇవ్వవలసినవి చెన్నై ఎయిర్ పోర్ట్ లోనే అందజేయమని చెప్పడంతో అలాగే చేశాను. నా సినిమాను తప్పకుండా చూస్తానని చెప్పి ఆయన వెళ్లారు. ఆ తరువాత కొంతసేపటికి నాకు ఫోన్ రానే వచ్చింది .. అక్కడ బాంబ్ బ్లాస్ట్ లో ఆయన చనిపోయారని. ఆ వార్తను నేను నమ్మలేకపోయాను .. నిజమేనని తెలిసిన తరువాత ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.