Andhra Pradesh: రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- రేణిగుంట ఎయిర్ పోర్టులో రన్ వే విస్తరణ పనులు
- ఈ విమానాశ్రయం అభివృద్ధికి రూ.177 కోట్లు మంజూరు
- పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా ఉండేలా రన్ వే
రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టులో రన్ వే విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు అక్కడికి చేరుకున్నారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రేణిగుంట విమానాశ్రయంలో పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా ఉండేందుకు రన్ వే ను విస్తరించినట్టు తెలిపారు.
పీపీపీ పద్ధతిలో పనులు వేగవంతంగా పూర్తయినట్టు చెప్పారు. త్వరలో తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలవనున్నారని తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం అభివృద్ధి నిమిత్తం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.177 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఏపీలో విమానాశ్రయాలను అభివృద్ధి పరుస్తున్నామని, ఈ క్రమంలోనే విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కడప విమానాశ్రయాలను ఆధునికీకరించినట్టు చెప్పారు.