India: సౌదీ యువరాజు కోసం నలభీమ పాకాలు... మెనూ చూస్తే నోరూరడం ఖాయం!
- ఎంపిక చేసిన వంటకాలతో అతిథికి విందు
- రాగన్ జోష్, తందూరీ గులాబీ మచ్చీ వడ్డింపు
- ముగ్ధుడైన ఎంబీఎస్
భారత పర్యటన కోసం విచ్చేసిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఘనమైన ఆతిథ్యం లభిస్తోంది. బుధవారం రాష్ట్రపతి భవన్ లో సౌదీ యువరాజు గౌరవార్ధం నోరూరించే రుచులతో విందు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చిన ఈ విందులో భారత్ లో ఎంతో ప్రసిద్ధిగాంచిన వంటకాలను వడ్డించారు. రాగన్ జోష్, తందూరీ గులాబీ మచ్చీ, కీమా సంబౌసెక్ వంటి మాంసాహార వంటకాలే కాకుండా దాల్ మఖని, బదిన్ ఏ జామ్, కుర్కురి టిల్ బిందీ వంటి వెజ్ ఐటమ్స్ కూడా సౌదీ యువరాజు కోసం మెనూలో చేర్చారు.
అంతేకాదు, భోజనం తర్వాత కేసర్ జిలేబీ, గులాబ్ జామూన్, షాహీ కుల్ఫీ, ఫలూదా వంటి మధురమైన వంటకాలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ విశిష్ట అతిథి కోసం ఎంతో ఖరీదైన డార్జిలింగ్ టీ, సౌతిండియన్ కాఫీ కూడా అందించారు. సౌదీ యువరాజు కోసం సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేయడం విశేషం అని చెప్పాలి. దేబంజన్ భట్టాచార్జీ, నిషాంత్ సింగ్, రోహన్ బోస్ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు వీనులకింపైన సంగీతంతో మహ్మద్ బిన్ సల్మాన్ ను అలరించారు.