Facebook: ఫేస్ బుక్ విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు... యూజర్ల ఆరోగ్య సమాచారం బహిర్గతం!
- ఈమెయిల్ ఐడీలు సహా వివరాలు బహిర్గతం
- ఫేస్ బుక్ పై తీవ్ర ఆరోపణలు
- స్పందించని యాజమాన్యం
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై నమ్మకం సడలుతోందనడానికి నిదర్శనంగా మరో ఘటన తెరపైకి వచ్చింది. ఎంతో సున్నితమైన యూజర్ల హెల్త్ డేటాను కాపాడడంలో ఫేస్ బుక్ ఘోరంగా విఫలమైందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికాలోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్ టీసీ)లో ఫిర్యాదు కూడా దాఖలైంది.
యూజర్లు పోస్ట్ చేసిన ఆరోగ్య వివరాలు ఫేస్ బుక్ నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా బహిర్గతం అవుతున్నాయంటూ ఓ సైబర్ భద్రతా నిపుణుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము గుర్తించిన సమస్యాత్మక అంశాలను ఫేస్ బుక్ దృష్టికి ఎన్నోమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని సదరు వ్యక్తి తెలిపారు. యూజర్ల హెల్త్ డేటా చౌర్యానికి గురవుతున్నట్టు గత జూలైలో మొదటిసారిగా గుర్తించారు.
జన్యు ఉత్పరివర్తనం (జీన్ మ్యూటేషన్) ప్రధాన టాపిక్ గా ఏర్పాటైన ఓ మహిళల గ్రూప్ లో పోస్ట్ చేసిన యూజర్ల ఆరోగ్య వివరాలు గంపగుత్తగా ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో తెలుసుకున్నారు. సాధారణ డౌన్ లోడ్ ఆప్షన్ ద్వారా కానీ, ఓ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ద్వారా కానీ యూజర్ల వివరాలను సునాయాసంగా డౌన్ లోడ్ చేసుకోగలిగే వీలుందని కనుగొన్నారు.
ప్రైవేట్ గా పోస్ట్ చేసిన డేటాను ఇతరులు షేర్ చేసే వీలున్నందునే ఫేస్ బుక్ ప్రైవసీ నిబంధనలు లోపభూయిష్టం అని చెప్పాల్సి వస్తోందని సదరు భద్రత నిపుణుడు తన ఫిర్యాదులో ప్రముఖంగా ప్రస్తావించారు. పైగా యూజర్ల హెల్త్ డేటాను ఇతరులు ఉపయోగించడం అనేది చట్టవిరుద్ధం కూడా అయినందున తాము ఫేస్ బుక్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ఆ వ్యక్తి ఆరోపించారు. ఇప్పటికే వినియోగదారుల సమాచార గోప్యతపై వందల కోట్ల డాలర్ల జరిమానాలు ఫేస్ బుక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో, తాజా ఆరోపణ మూలిగే నక్కపై తాటిపండు లాంటిదని చెప్పొచ్చు.