Jagan: శివకుమార్‌పై సస్పెన్షన్ వేటు విషయంలో.. జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడాన్ని ప్రశ్నించిన శివకుమార్
- సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి
- ఈసీని ఆశ్రయించిన శివకుమార్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ను సస్పెండ్ చేసిన విషయంలో మార్చి 11వ తేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వ్యవస్థాపక అధ్యక్షుడినైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన సీఈసీకి ఫిర్యాదు చేశారు.
శివకుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు జారీచేసింది. శివకుమార్‌ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కాగా, 2009లో శివకుమార్ వైసీపీని స్థాపించారు. అనంతరం వైఎస్సార్ కుటుంబంపై వున్న అభిమానంతో పార్టీని జగన్‌కు అప్పగించారు.
నాటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా, శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైసీపీ మద్దతు ప్రకటించడాన్ని ప్రశ్నించారు. వైఎస్‌ను తీవ్రంగా దూషించిన కేసీఆర్‌కు ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్ అభిమానిగా తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జనన్ పార్టీ నుంచి శివకుమార్‌ను బహిష్కరించారు.