Cricket: ఆడకుండానే .. పాకిస్థాన్ కు వరల్డ్ కప్ ఇచ్చేద్దామా?: బీసీసీఐ
- పాక్ తో క్రికెట్ వద్దంటున్న క్రీడాభిమానులు
- ఫైనల్ కు పాక్ వస్తే కప్ వెళ్లిపోతుందన్న బీసీసీఐ
- కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఆడబోమన్న ఉన్నతాధికారి
మరో మూడు నెలల్లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా, పాకిస్థాన్ ఆడాల్సి వస్తే, దాన్ని రద్దు చేసుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ, ఈ విషయంలో బీసీసీఐ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. పాకిస్థాన్ తో ఆడరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే, తాము పాటిస్తామని చెప్పింది.
ఇదే సమయంలో మ్యాచ్ ని మనం రద్దు చేసుకుంటే, పాక్ కు పాయింట్లు వెళతాయని, ఒకవేళ పాక్ ఫైనల్ కు వస్తే, అప్పుడు ఆడకుండానే పాక్ కు వరల్డ్ కప్ ట్రోఫీని ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ విషయంలో తాము ఐసీసీని ఇప్పటివరకూ సంప్రదించలేదని, భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్థిస్థామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఈ విషయంలో ఏదో ఒకటి తేలడానికి ఇంకా సమయం పడుతుందని, పోటీలకు ముందు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని అన్నారు. కాగా, జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి ఆత్మాహుతి దాడి తరువాత పాక్ తో క్రికెట్ ఆడవద్దని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.