Pakistan: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను తప్పిస్తారా?.. మమ్మల్ని తప్పుకోమంటారా?: ఐసీసీకి లేఖను సిద్ధం చేసిన బీసీసీఐ
- పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ
- ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పేరిట లేఖ సిద్ధం
- పాకిస్థాన్‌తో ఏ ఆటా ఆడొద్దన్న సౌరవ్ గంగూలీ
పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేశంలోని అన్ని వర్గాల నుంచి పాక్‌పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా స్పందించింది. త్వరలో జరగనున్న ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని కోరుతోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలక మండలి (సీవోఏ).. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పేరిట ఓ లేఖను సిద్ధం చేసింది. ప్రపంచకప్ నుంచి పాక్‌ను నిషేధించాలని, లేదంటే తామే వైదొలుగుతామని ఆ లేఖలో హెచ్చరించింది. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన మీదట ఈ లేఖను ఐసీసీకి పంపడంపై నేడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇదిలా ఉంచితే, ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో పది దేశాలు ఆడతాయని, ఒక్కో దేశం మరో దేశంతో తలపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భారత్ ఒక మ్యాచ్ ఆడకపోవడం పెద్ద సమస్య కాబోదని అభిప్రాయపడ్డాడు. అయితే, భారత జట్టు లేకుండా ముందుకెళ్లడం ఐసీసీకి చాలా కష్టమని తేల్చి చెప్పాడు. అయితే, భారత్‌కు అలా చేయగలిగే శక్తి మాత్రం ఉందన్నాడు. పాకిస్థాన్‌కు తప్పకుండా గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనన్న గంగూలీ.. పాక్‌తో క్రికెట్ ఒక్కటే ఆడకపోవడం కాదని, హాకీ, ఫుట్‌బాల్.. ఇలా ప్రతీ ఆటను పాక్‌తో ఆడడాన్ని మానుకోవాలని సూచించాడు.