Pakistan: ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా.. టీవీ చర్చా కార్యక్రమంలో కొట్టుకున్న పాకిస్థాన్ నేతలు!
- వీధి రౌడీల్లా వ్యవహరించిన నేతలు
- పుల్వామా దాడి ఘటనపై చర్చ సందర్భంగా ఆవేశం
- ఆశ్చర్య పోయిన ప్రేక్షకులు
స్థాయి మర్చిపోయారు. తామెక్కడ ఉన్నదీ గుర్తుంచుకోలేదు. హుందాగా వ్యవహరించాలన్న కనీస మర్యాద పాటించలేదు. వీధి రౌడీల్లా, అదీ లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తుండగా ఆవేశకావేశాలకు లోనై టీవీ స్టూడియోలోనే తన్నుకున్నారు. నివ్వెరపరిచే ఈ సంఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే...జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడిచేసి పలువురు జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇరుదేశాల మధ్య టెన్షన్‌కు కారణమైంది. ప్రతీకారం తీర్చుకుని తీరుతామని భారత్ ప్రకటించగా, తమకేమీ తెలియదని, అనవసరంగా తమమీదికి వస్తే అడ్డుకుని తీరుతామని పాకిస్థాన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ‘1టీవీ కాబూల్’ అనే చానల్ ఓ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు నేతలు ఈ చర్చలో పాల్గొన్నారు. డిబేట్ కొనసాగుతున్న కొద్దీ వారి మధ్య ఆవేశాలు పెరిగాయి. విమర్శలు, ప్రతివిమర్శలు ఎక్కువయ్యాయి. సాధారణంగా అటువంటి సమయంలో ఎంతో సంయమనం పాటించాల్సి ఉంటుంది. కానీ వారది మర్చిపోయారు.
గొంతులో తీవ్రత పెరిగాక ఓ నేత మరో నేతపై దాడిచేశాడు. అతను కూడా ఎదురుదాడిచేసి పిడిగుద్దులు కురిపించాడు. ఇద్దరూ తన్నుకుంటుండగా మిగిలిన వారు వారిని విడిపించారు. లైవ్ డిబేట్‌లో పాకిస్థాన్ నేతలు తన్నుకున్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.