BJP: జోరు పెంచిన బీజేపీయేతర పక్షాలు.. 27న ఢిల్లీలో సమావేశం
- పార్లమెంటు అనుబంధ భవనంలో భేటీ
- హాజరుకానున్న చంద్రబాబు, కేజ్రీవాల్
- ఎన్డీయేను ఎదుర్కోవడంపై చర్చ
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన బీజేపీ (ఎన్డీయే) యేతర పక్షాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 27న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా లోక్సభ ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న మిత్రపక్షాలు దీనిపై మరింత లోతుగా చర్చించనున్నాయి. అలాగే, ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా రూపకల్పన బాధ్యతను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అప్పజెప్పాయి.
27న పార్లమెంటు అనుబంధ భవనంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేంద్ర మాజీ మంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్ఎల్డీ, ఆర్జేడీ, ముస్లింలీగ్, వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ముందస్తు కూటమితోనే ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, పుల్వామా ఉగ్రదాడి విషయంలో కేంద్ర వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలన్న విషయాన్ని కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.