olimpic union: అది చార్టర్ విధి విధానాలకు వ్యతిరేకం: భారత్‌పై ఒలింపిక్ సంఘం ఆగ్రహం
- పాకిస్థాన్ షూటర్లకు వీసా నిరాకరణపై తీవ్రస్పందన
- భవిష్యత్తులో పోటీల నిర్వహణ విషయంలో పునరాలోచనకు నిర్ణయం
- రాపిడ్ ఫైర్ ఈవెంట్‌కు ఒలింపిక్ హోదా రద్దు
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారత్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేటి నుంచి ఢిల్లీలో షూటింగ్ ప్రపంచకప్ ప్రారంభం కావాల్సి ఉంది. పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ షూటర్లకు వీసా ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'ఇది ఒలింపిక్ చార్టర్ విధివిధానాలకు వ్యతిరేకం. అంతర్జాతీయ పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను సమానంగా చూడాలి. ఈ విషయంలో భారత్ నియమావళిని ఉల్లంఘించింది’ అంటూ పేర్కొంది. అథ్లెట్ల విషయంలో రాజకీయ జోక్యం సరికాదని, ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపించకూడదని చెప్పింది. భారత్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించినందున భవిష్యత్తులో భారత్‌లో అంతర్జాతీయ పోటీల నిర్వహణపై ఆ దేశంతో చర్చలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అదే సమయంలో ఢిల్లీలో జరిగే ప్రపంచకప్ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్‌కు ఒలింపిక్ హోదా అర్హతను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఒలింపిక్ చార్టర్ నియమ నిబంధనల మేరకు విదేశీ పోటీ దారులకు ప్రవేశ అనుమతి కల్పిస్తామని భారత్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు ఒలింపిక్ సంబంధిత పోటీల నిర్వహణకు ఆ దేశానికి అనుమతి ఇవ్వమని ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది.