Andhra Pradesh: వైసీపీకి షాకివ్వనున్న పాణ్యం ఎమ్మెల్యే?
- వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటుపై హామీ ఇవ్వని జగన్
- కాటసాని చేరికతో తగ్గిన ప్రాధాన్యం
- వచ్చే నెల 6న టీడీపీలోకి గౌరు దంపతులు?
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున సీటు దక్కదని భావిస్తున్న, అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ నేతలు, ఆశావహులు పార్టీలు మారే పనిలో పడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఆయా నేతలకు ఆయా పార్టీలు వలవేస్తున్నాయి. ఇటీవలే ఏపీ టీడీపీలోని కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లారు. అదేవిధంగా వైసీపీకి చెందిన కొందరు నేతలు కూడా టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం టికెట్ ఆమెకు దక్కే అవకాశాలు లేవని తెలియడంతో, వైసీపీ తీరుపై గౌరు చరిత, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీలో చేరడంతో తమ ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు భావిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి తోడు, వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ను గౌరు చరితకు ఇస్తానని జగన్ హామీ ఇవ్వకపోవడం కూడా ఆమె వైసీపీని వీడాలన్న ఆలోచనకు దారితీసినట్టు గౌరు వర్గీయుల ద్వారా తెలుస్తోంది. వైసీపీకి గౌరు చరిత రాజీనామా చేసి వచ్చే నెల 6వ తేదీన తన భర్తతో పాటు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో తమ అనుచరులు, కార్యకర్తలతో గౌరు దంపతులు సమావేశం కానున్నారని సమాచారం.