railway: రైల్వే శాఖలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ.. నేడు ప్రకటన విడుదల!
- ఉద్యోగ జాతరకు తెరలేపిన రైల్వేశాఖ
- పోస్టుల వారీగా ఇంకా రాని స్పష్టత
- ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ఉద్యోగాల జాతరకు తెరలేపింది. ఇందులో భాగంగా 1,30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈరోజు ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో ప్రకటన వెలువరించనుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇవే..
నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు 28 నుంచి...
ఈ విభాగంలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. నాన్ టెక్నికల్ పోస్టులకు ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
పారామెడికల్ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి..
వైద్య విభాగంలోని పారామెడికల్ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విభాగంలో నర్సు, హెల్త్ ఇన్స్పెక్టర్, మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మాసిస్టు, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
కార్యాలయ ఉద్యోగాలకు మార్చి 8 నుంచి...
స్టెనోగ్రాఫర్, చీఫ్ అసిస్టెంట్, జూనియర్ అనువాదకుడు (హిందీ) వంటి ఉద్యోగ ఖాళీలు ఈ విభాగంలో ఉన్నాయి. మొత్తం ఈ మూడు విభాగాల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు మార్చి 8 నుంచి ఆన్లైన్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
లెవల్-1 ఉద్యోగాలకు మార్చి 12 నుంచి..
లెవల్-1 (గతంలో గ్రూపు-డి కేటగిరీ అని పిలిచేవారు) ఉద్యోగాలకు మార్చి 12 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విభాగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఈ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు ఉంటాయి.