Andhra Pradesh: వైసీపీలో చేరాల్సిందిగా బెదిరింపులు వస్తుంటే గల్లా, సీఎం రమేశ్, సుజనా ఇంకా టీడీపీలో ఎందుకున్నారు?: బొత్స
- చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది
- ఆయన చిన్నమెదడు చెడిపోయినట్లు ఉంది
- అవంతి ఆస్తులన్నీ ఏపీలోనే ఉన్నాయి
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటమి భయంతో ఏపీ సీఎం చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. జగన్ హవాలా డబ్బు కోసమే లండన్ పర్యటనలకు వెళ్లారన్న టీడీపీ నేతల ఆరోపణలను బొత్స ఖండించారు. టీడీపీ నేతల మాటలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏపీకి ఏం చేశామో, ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో చెప్పకుండా చంద్రబాబు, లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు ఓ టీవీ ఛానల్ తో బొత్స మాట్లాడారు.
చంద్రబాబు విదేశాల నుంచి హవాలా డబ్బులు తెచ్చుకుంటారు కాబట్టే అందరూ తనలా ఉంటారని భావిస్తున్నారని బొత్స విమర్శించారు. జగన్ కుమార్తె లండన్ లో చదువుకుంటుంటే చూడటానికి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. చంద్రబాబు పరిస్థితి చూస్తే చిన్నమెదడు చెడిపోయినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను వైసీపీలో చేరాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని చంద్రబాబు చెప్పడంపై సైతం బొత్స ఘాటుగానే స్పందించారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, గల్ల జయదేవ్ ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయనీ, వారు ఇంకా వైసీపీలో ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ కు హైదరాబాద్ లో ఇల్లు మాత్రమే ఉందనీ, ఆస్తులు, కాలేజీలన్నీ ఏపీలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.