Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ స్పష్టంగా చెప్పారు.. మార్ఫింగ్ వీడియోలతో టీడీపీ మోసం చేస్తోంది!: కన్నా లక్ష్మీనారాయణ
- రాహుల్ గాంధీ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు
- ప్రత్యేకహోదాను విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు?
- మన్మోహన్ చెప్పినదాని కంటే ఎక్కువ నిధులే ఇస్తున్నాం
చిత్తూరు జిల్లా తిరుపతిలో నిన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రసంగంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ తీరు తల్లిదండ్రులను చంపేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లి..‘నేను అనాధను అయ్యాను. కాపాడండి’ అన్న రీతిలో ఉందని విమర్శించారు. టీడీపీ మార్ఫింగ్ చేసిన వీడియోను చూపించి ఏపీ ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే ప్రత్యేకహోదాను విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలనే ఆర్డినెన్స్ ను అప్పటి కేంద్ర కేబినెట్ ఎందుకు ఆమోదించలేదని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని కన్నా గుర్తుచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీల కంటే మోదీ ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నిధులే ఇస్తోందని అన్నారు.