anam: మీరు ఏ ఫొటోతో ఓట్లు అడుక్కుంటున్నారో.. ఆ ఫొటోలోని వైయస్ కూడా కాంగ్రెస్ నాయకుడే: ఆనంపై కొలనుకొండ శివాజీ ఫైర్
- తిన్నింటి వాసాలను లెక్కించడాన్ని ఆనం ఆపేయాలి
- మోదీ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారు
- వైసీపీ ఓటర్లందరూ కాంగ్రెస్ మద్దతుదారులే
వైసీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆనంకు పదవి లేనిదే నిద్రపట్టదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయిన ఆనంకు నైతిక విలువలు లేవని అన్నారు. మొన్నటిదాకా టీడీపీలో ఉన్నారని, ఇప్పుడు వైకాపాలో కొనసాగుతున్నారని, రేపు ఎక్కడుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన మాదిరి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని... ఇదే సమయంలో ప్రధాని మోదీ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టైతే... ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి ఎందుకు దిగుతామని కొలనుకొండ శివాజీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా... కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. వైసీపీ సహా అన్ని పార్టీల అంగీకారంతోనే ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ విభజించిందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలపడిందని చెప్పారు. వైసీపీ ఓటర్లందరూ కాంగ్రెస్ మద్దతుదారులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏ ఫొటోతో మీరు ఓట్లను అడుక్కుంటున్నారో... ఆ ఫొటోలోని వైయస్ రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్ వ్యక్తేననే విషయాన్ని గ్రహించాలని చెప్పారు. తిన్నింటి వాసాలను లెక్కించడాన్ని ఆనం ఆపేయాలని సూచించారు.