Assam: కల్తీ మద్యం కాటు: పది నిమిషాలకు ఒకరు చొప్పున 110 మంది మృతి.. అసోంలో ఘోరం
- కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన తేయాకు కార్మికులు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
అసోంలో కల్తీమద్యం కాటుకు ఏకంగా 110 మంది తేయాకు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు ప్రతిధ్వనిస్తున్నాయి. కల్తీ మద్యం తాగిన వారిలో 31 మంది శనివారం సాయంత్రమే ప్రాణాలు కోల్పోగా అప్పటి నుంచి గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోతూనే ఉంది.
శనివారం సాయంత్రానికి మృతుల సంఖ్య 110కి చేరుకుంది. మరో 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఒక్క గోల్‌ఘాట్ జిల్లాలోనే 59 మంది మృతి చెందగా, జోర్‌హాట్ జిల్లాకు చెందిన వారు 45 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నట్టు స్వయంగా అసోం ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ విశ్వకర్మ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కల్తీ మద్యం తాగిన తేయాకు కూలీలందరూ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
శనివారం సీఎం సోనోవాల్ జోర్‌హాట్ వైద్య కళాశాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.