Andhra Pradesh: టీడీపీలో చేరిన కిశోర్ చంద్రదేవ్.. అభ్యంతరం లేదంటూనే డుమ్మా కొట్టిన అశోక్ గజపతిరాజు!
- గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చంద్రదేవ్
- ఐదు సార్లు లోక్ సభ, ఓసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం
- హాజరుకాని సీనియర్ నేత అశోక్ గజపతి రాజు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కిశోర్ చంద్రదేవ్ ఈరోజు టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో చంద్రదేవ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రదేవ్ తో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ, కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్న కిశోర్ చంద్రదేవ్.. ఐదుసార్లు లోక్సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు.
యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, చంద్రదేవ్ టీడీపీలో చేరడంపై కేంద్ర మాజీ మంత్రి, అశోక్ గజపతి రాజు అయిష్టత వ్యక్తం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే చంద్రదేవ్ టీడీపీలో చేరితే స్వాగతిస్తానని, ఆయన చేరికపై ఎలాంటి అభ్యంతరం లేదని అశోక్ గజపతిరాజు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా ఉండవల్లిలో చేరిన ఈ కార్యక్రమానికి అశోక్ గజపతి రాజు గైర్హాజరు కావడంతో మళ్లీ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.