Andhra Pradesh: ఏపీ, తెలంగాణ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
- నామినేషన్ల దాఖలుకు మార్చి 5 చివరి గడువు
- 22న ఎన్నికలు.. 26న ఫలితాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే నెల 22న ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 26న ఫలితాలు కూడా విడుదల అవుతాయి.
నామినేషన్ల దాఖలుకు వచ్చే నెల 5 చివరి తేదీ కాగా, ఆరో తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 8వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.