Andhra Pradesh: ప్రతిపక్షాలకు కౌంటరివ్వడంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు: చంద్రబాబు
- ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించరే!
- దేనికైనా నేనే సమాధానం చెబుతున్నా
- మంత్రు లెవ్వరూ పట్టించుకోవడం లేదు
ఏపీలో ప్రభుత్వం తీరు, రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు.. వంటి విషయాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఘాటుగా కౌంటరివ్వడంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
ఈ రోజు ఉదయం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రులతో ఈ సమావేశం జరిగింది. ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలపై ఘాటుగా ఎందుకు స్పందించడం లేదని మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టకపోతే ప్రజలు అవే నిజమని నమ్మే ప్రమాదం ఉందని వారితో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
దేనికైనా తానే సమాధానం చెబుతున్నాను తప్ప, మంత్రులెవ్వరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. మంత్రులుగా ఉండి సీరియస్ నెస్ లేకపోతే ఎలా? అంటూ వారిని మందలించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నేత కేటీఆర్ చేస్తున్న విమర్శలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఎన్నికల సమయం కనుక, ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు తగిన విధంగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మంత్రులను ఆదేశించినట్టు సమాచారం.