West Godavari District: పశ్చిమ గోదావరి టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
- ఏలూరు, నర్సాపురం పరిధిలోని నేతలతో సమావేశం
- ప.గో.లోని అసెంబ్లీ స్థానాల్లో అధిక శాతం ‘సిట్టింగ్’లకే?
- ఏలూరు పార్లమెంట్ పరిధిలో మాత్రం ‘సిట్టింగ్’లను మార్చే అవకాశం
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏలూరు, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని 14 శాసనసభ స్థానాల్లో అధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో మాత్రం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలున్నట్టు సమాచారం. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముడియం శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడి నుంచి బొరగం శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు.
చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పీతల సుజాత ఉన్నారు. అక్కడి నుంచి కర్రా రాజారావు, నాగరాజు, సొంగా రోషన్ లు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం లభించనున్నట్టు సమాచారం. నర్సాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాధవనాయుడు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు టికెట్ ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం టికెట్ కోసం బాపిరాజు, ఈలి నాని మధ్య పోటీ ఉన్నట్లు టీడీపీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో వెంకటరమణ, రామాంజనేయులు, వెంకటరావులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. నూజివీడు స్థానం కోసం ముదరబోయిన, అట్లూరి రమేశ్ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.