Punjab: పంజాబ్ అప్రమత్తం.. నేడు సరిహద్దు ప్రాంతాల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ పర్యటన
- భారత బలగాల సామర్థ్యం భేష్
- దేశ రక్షణ కోసం పంజాబ్ కట్టుబడి ఉంది
- విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. భారత బలగాల సామర్థ్యం భేష్ అంటూ కొనియాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మెరుపు దాడి తర్వాత రాష్ట్రం అప్రమత్తమైనట్టు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో నేడు పర్యటించనున్నట్టు చెప్పారు.
పాక్ నుంచి ఎదురయ్యే ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పంజాబ్ సిద్ధంగా ఉందన్న అమరీందర్.. దేశ రక్షణ కోసమే పంజాబ్ ఉన్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తాను ఇదే విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రక్షణ శాఖతో నిత్యం టచ్‌లోనే ఉన్నామని తెలిపారు. కాగా, ప్రస్తుత పరిస్థితిపై అన్ని శాఖల ముఖ్య అధికారులతో చర్చించినట్టు పేర్కొన్నారు.