daggubati: జగన్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకోని దగ్గుబాటి!
- నిన్న వైసీపీలో చేరిన హితేశ్, ఆమంచి
- కండువా వేసుకోవడానికి దగ్గుబాటిని పిలిచిన ఆమంచి
- హితేశ్ ను ముందుకు పంపి, వెనకే ఉండిపోయిన దగ్గుబాటి
వైసీపీ అధినేత జగన్ సమక్షంలో నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేశ్ చెంచురామ్, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లు ఆ పార్టీలో చేరారు. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కార్యాలయంలో వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తొలుత పార్టీ కండువాను ఆమంచికి జగన్ వేయబోయారు. అయితే, దగ్గుబాటిని ఆమంచి ఆహ్వానించారు. కానీ, దగ్గుబాటి ముందుకు రాకుండా తన కుమారుడు హితేశ్ ని ముందుకు పంపారు. దీంతో, హితేశ్ మెడలో జగన్ వైసీపీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆమంచి మెడలో పార్టీ కండువా వేశారు. దగ్గుబాటి వైసీపీ కండువా వేసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దగ్గుబాటి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన కుమారుడు వైసీపీలో చేరినా... పార్టీలో దగ్గుబాటి ఎంత మేరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది.