abhinandan: పైలట్ అభినందన్ కాల్లోకి బుల్లెట్ దింపిన పాకిస్థానీ యువకుడు.. అసలేం జరిగిందో తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

  • పాక్ భూభాగంపై పడగానే అతన్ని వెంటాడిన యువకులు
  • తన వద్ద ఉన్న డాక్యుమెంటన్లు ధ్వంసం చేసేందుకు యత్నించిన అభినందన్
  • ఇండియా గడ్డపై ఉన్నాడో.. పాక్ గడ్డపై ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి

భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ జెట్ పాక్ గడ్డపై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మన పైలట్ అభినందన్ కూలుతున్న విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ తర్వాత అతన్ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకోవడం, నెత్తురోడుతున్న ఆయన వీడియోలు, టీ తాగుతూ భయం లేకుండా సమాధానాలు చెప్పిన వీడియాలు ఇవన్నీ మనం చూశాం. అయితే, విమానం నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత అసలు ఏం జరిగింది? పాకిస్థాన్ కు చెందిన 58 ఏళ్ల పొలిటికల్, సోషల్ యాక్టివిస్ట్ మొహమ్మద్ రజాక్ పాక్ పత్రిక 'డాన్'కు రాసిన కథనంలో అన్ని వివరాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. అసలేం జరిగిందో రజాక్ మాటల్లోనే యథాతథంగా...

పారాచూట్ సాయంతో ఒక ఇండియన్ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అతని వద్ద పిస్టల్ ఉంది. వెంటనే అతను వెనుకవైపుగా, భారత్ దిశగా అర కిలోమీటర్ దూరం పరుగెత్తాడు. అతన్ని కొందరు యువకులు వెంబడిస్తున్నారు. దీంతో, వారిని నిలువరించేందుకు ఆ పైలట్ సదరు యువకులపై పిస్టల్ గురి పెట్టాడు. గాల్లోకి కొన్ని సార్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్న నీటి కుంటలోకి దూకాడు. వెంటనే తన జేబులో ఉన్న డాక్యుమెంట్లు, మ్యాప్ లను బయటకు తీసి మింగడానికి యత్నించాడు. కొన్నింటిని నీటిలో ముంచి నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో తన వద్ద ఉన్న పిస్టల్ ను పడేయాలని అక్కడున్న యువకులు గట్టిగా అరిచారు. ఈ సమయంలో ఒక యువకుడు తన వద్ద ఉన్న తుపాకితో పైలట్ కాల్లోకి కాల్చాడు.

ఇది ఇండియానా? లేక పాకిస్థానా? అని అక్కడున్న యువకులను పైలట్ అడిగాడు. ఇది ఇండియానే అంటూ ఒకడు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా పైలట్ కొన్ని నినాదాలు చేశాడు. ఆ తర్వాత ఇండియాలో కరెక్ట్ గా ఏ ప్రాంతంలో ఉన్నానని గట్టిగా అరిచాడు. అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చి తనను చంపవద్దని అడిగాడు. వెంటనే అక్కడున్న యువకులు పైలట్ ను గట్టిగా పట్టుకున్నారు. వారిలో కొందరు పైలట్ ను చితకబాదారు. మరికొంత మంది నిలువరించే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పాక్ సైనికులు అక్కడకు వచ్చారు. పైలట్ ను అదుపులోకి తీసుకుని సదరు యువకుల నుంచి అతన్ని కాపాడారు.

మరోవైపు, డాన్ కథనం ప్రకారం... అభినందన్ ను పాక్ సైనికులు మిలిటరీ వాహనాల్లో అక్కడి నుంచి భీంభర్ క్యాంప్ కు తరలించారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ కాన్వాయ్ కు అక్కడి ప్రజలు కేరింతలు కొడుతూ అభినందనలు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి పువ్వులు చల్లారు. పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ జిందాబాద్, పాకిస్థాన్ వర్ధిల్లాలి, కశ్మీర్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

పాక్ భూభాగంపై పడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా, శత్రువులకు చిక్కకుండా అభినందన్ ఎస్కేప్ కావడానికి యత్నించడం గమనార్హం. తనను ఒక మూక వెంటాడుతున్నప్పటికీ... తన వద్ద ఉన్న వాయుసేన డాక్యుమెంట్లు, మ్యాప్ లు వారికి దొరకకుండా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం... దేశ రక్షణలో మన సైన్యానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటిచెబుతోంది.

  • Loading...

More Telugu News