Andhra Pradesh: ఇది నమ్మించి మోసగించడం కాదా? నమ్మక ద్రోహం కాదా?: కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం
- ఆదాయం లేని రైల్వే జోన్ పై బాబు అసంతృప్తి
- వాల్తేరు డివిజన్ తప్పించి ఏపీకి రూ.6,500 కోట్లు నష్టం చేశారని వ్యాఖ్య
- ట్విట్టర్ లో మండిపడ్డ ఏపీ ముఖ్యమంత్రి
ఉత్తరాంధ్ర ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న విశాఖ రైల్వేజోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేయగా, అధికార టీడీపీ, కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. భారీగా ఆదాయం సమకూరే వాల్తేరు డివిజిన్ ను ఒడిశాకు కట్టబెట్టి కేవలం ప్యాసింజర్ ఆదాయమున్న రైల్వే జోన్ ను ఏపీకి అప్పగించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘విశాఖ రైల్వే జోన్ ప్రకటన.. వెనుకటికెవరో పాలిచ్చే గేదె ముందు భాగం మీకు.. వెనుక భాగం మాకు అన్నట్లు ఉంది. ఆదాయం కోల్పోయిన డివిజన్లతో జోన్ ఇవ్వడం దేనికి? ఆదాయ వనరులతో కూడిన పూర్తి స్థాయి రైల్వే జోన్ ను రాష్ట్రం కోరుకుంటోంది. రాష్ట్ర ప్రజలు నిలదీస్తారనే భయంతో, రాజకీయంగా ఇచ్చే జోన్ ను కోరుకోవడం లేదు.
విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు, వాల్తేరు డివిజన్ ను మింగేశారు. ఏపీకి రూ.6,500 కోట్లు నష్టం చేశారు. హుద్-హుద్ పరిహారం రూ.1000 కోట్లలో సగం ఎగ్గొట్టారు. తిత్లీ బాధితులకు అన్యాయం చేశారు. 7 జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి లాగేశారు. ఇది నమ్మించి మోసగించడం కాదా? నమ్మక ద్రోహం కాదా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.