India: నాడు ‘చెలియా’ కోసం అభినందన్ తండ్రిని కలిసిన దర్శకుడు మణిరత్నం
- ‘చెలియా’లో కార్గిల్ వార్ కు సంబంధించిన ఓ సన్నివేశం
- సమాచారం కోసం నాడు వర్థమాన్ తో మణిరత్నం భేటీ
- ఈ చిత్రంలో పాక్ ఆర్మీకి హీరో కార్తి పట్టుబడే సన్నివేశం
పాకిస్థాన్ కు పట్టుబడ్డ ఐఏఎఫ్ పైలట్ విక్రమ్ అభినందన్ ను రేపు భారత్ కు అప్పగిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ కు పట్టుబడ్డ తనపై స్థానికులు దాడి చేశారని, పాక్ ఆర్మీ వారిని అడ్డుకుని తనను కాపాడిందని విక్రమ్ నిన్న ఓ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని పక్కనబెడితే, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొన్నేళ్ల క్రితం తమిళంలో తెరకెక్కించిన ‘కాట్రు వెలియిడాయ్’ (తెలుగులో ‘చెలియా’) చిత్రంలో కార్గిల్ వార్ కు సంబంధించిన ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో ఐఏఎఫ్ స్క్వాడ్రన్ లీడర్ వరుణ్ చక్రవర్తి (కార్తి) నడుపుతున్న విమానాన్ని పాకిస్థాన్ ఆర్మీ కూల్చి వేస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకుని పాక్ ఆర్మీ చిత్ర హింసలు పెట్టడం ఈ చిత్రంలో ఉంటుంది. అయితే, ఐఏఎఫ్ కు సంబంధించిన సమాచారం కోసం రిటైర్డ్ ఎయిర్ మార్షల్, అభినందన్ తండ్రి వర్థమాన్ ని మణిరత్నం కలిశారట. ఆ సినిమాలో కార్తి ఎదుర్కొన్న సమస్యనే నిజ జీవితంలో అభినందన్ ఎదుర్కోవడం ఇప్పుడు కాకతాళీయం.