Palaniswamy: తమిళనాడు సీఎం పళనిస్వామికి తృటిలో తప్పిన ముప్పు!
- మధురైకి బయలుదేరిన విమానం
- గాల్లోకి ఎగరగానే సాంకేతిక లోపం
- విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలట్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఈ ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఈ ఉదయం చెన్నై నుంచి మధురైకి బయలుదేరారు పళనిస్వామి.
విమానం టేకాఫ్ కాగానే, ఇంజన్ లో లోపం తలెత్తినట్టు గుర్తించిన పైలట్, విషయాన్ని గ్రౌండ్ స్టాఫ్ కు తెలిపి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాట్లు చేయాలని కోరాడు. ఆపై విమానాన్ని జాగ్రత్తగా దించాడు. ఈ లోపంతో విమానం పూర్తి ఎత్తునకు వెళితే, పెను ప్రమాదం జరిగివుండేదని తెలుస్తోంది. ఆపై పళనిస్వామి మరో విమానంలో మధురైకి వెళ్లిపోయారు. విమానం ఇంజన్ లో టెక్నికల్ ఫాల్ట్ ను ముందుగానే ఎందుకు గుర్తించలేదన్న విషయమై విచారణకు ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.