India: అభినందన్ తల్లిదండ్రులకు కరతాళధ్వనులతో స్వాగతం పలికిన ప్రయాణికులు!
- చెన్నై విమానాశ్రయంలో ఘటన
- పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్
- నేడు విడుదల చేయనున్న దాయాది దేశం
భారత వాయుసేన(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను ఈరోజు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అభినందన్ ను అప్పగిస్తారని భావిస్తున్న అట్టారి బోర్డర్ వద్దకు భారతీయులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోపక్క, తమ కుమారుడిని కలుసుకునేందుకు విమానం ఎక్కిన అభినందన్ తల్లిదండ్రులకు అనూహ్య గౌరవం దక్కింది.
విశ్రాంత ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్, శోభా వర్ధమాన్ నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చేందుకు చెన్నైలో విమానం ఎక్కారు. అయితే వీరిని గుర్తుపట్టిన ప్రయాణికులు లేచి నిలబడి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. వర్ధమాన్ తల్లిదండ్రులతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వర్ధమాన్ తన మిగ్-21తో కుప్పకూల్చారు. అయితే ఈ సందర్భంగా శత్రువుల దాడిలో తన విమానం దెబ్బతినడంతో వర్ధమాన్ పాక్ ఆర్మీకి చిక్కారు.