Narendra Modi: మోదీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- పలు జిల్లాల్లో టీడీపీ నిరసనలు
- పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
- విశాఖలో మోదీకి వ్యతిరేక హోర్డింగ్స్
ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వకపోగా, అధిక ఆదాయాన్ని ఇచ్చే వాల్తేరు డివిజన్ ను తొలగిస్తూ విశాఖపట్నానికి రైల్వే జోన్ కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ గడ్డపై అడుగు పెట్టడానికి వీల్లేదంటూ, టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతుండగా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని మోదీ విధానాలను తూర్పారబట్టారు.
విశాఖ పట్టణంలో మోదీకి వ్యతిరేకంగా పలు హోర్డింగ్స్ ఏర్పాటు అయ్యాయి. జీవీఎంసీ వద్ద మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా, కిడారి శ్రవణ్ లు నిరసనకు దిగారు. ఇదే ప్రాంతంలో ప్రత్యేక హోదా సాధన సమితి కూడా నిరసనలు తెలిపింది. విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి వీధుల్లోకి వచ్చారు. మోదీకి వ్యతిరేక నినాదాలు చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద దేవినేని అవినాష్ రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించగా, నెల్లూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు ధర్మపోరాట దీక్షలు చేశారు.