Telangana: ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ బిజీ.. అసదుద్దీన్‌కు పోటీగా అజారుద్దీన్
- అభ్యర్థుల వేటలో కాంగ్రెస్
- మల్కాజిగిరి, వరంగల్ మినహా దాదాపు కొలిక్కి
- ఈసారి నియోజకవర్గం మారుతున్న మధుయాష్కీ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికలో తెలంగాణ కాంగ్రెస్ తలమునకలైంది. అంగబలం, అర్థబలం ఉన్న నేతలను బరిలోకి దింపాలని యోచిస్తున్న కాంగ్రెస్.. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా బలమైన అభ్యర్థులకు కొదవలేదని భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్‌పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అందులో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వైపు చూస్తోంది. ఎంఐఎం నేత అసదుద్దీన్‌పై అజార్‌ను పోటీకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన కాదంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్‌ను బరిలోకి దింపాలని యోచిస్తోంది.
ఇక, చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా, నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు టికెట్ దక్కే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ నుంచి ఈసారి ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఈసారి భువనగిరి నుంచి పోటీకి సిద్ధపడుతుండగా, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, జహీరాబాద్ నుంచి మదన్ మోహన్ రావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. మల్కాజిగిరి, వరంగల్‌లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.