Andhra Pradesh: ‘మంగళగిరి’ సీటుపై రచ్చ.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి!
- నిన్న వైసీపీలో చేరిన బీసీ నేత ఉడుతా శ్రీను
- ఆయనకే టికెట్ ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం
- తనకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆర్కే మనస్తాపం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు వైసీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ కు నమ్మినబంటులా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు చేస్తున్న ఫోన్లకు ఆయన స్పందించడం లేదు. వైసీపీ అధినేత జగన్ తీరుతో మనస్తాపం చెందిన ఆర్కే, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
నిన్న హైదరాబాద్ లోని జగన్ నివాసంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన కౌన్సెలర్ ఉడుతా శ్రీను కూడా తన మద్దతుదారులతో కలిసి వైసీపీ లో చేరారు. జిల్లాలో టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తనను సంప్రదించకపోవడంపై రామకృష్ణా రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గంలో బీసీల జనాభా గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉడుతా శ్రీను రంగంలోకి దిగొచ్చని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ నేపథ్యంలో ఆర్కే సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, ఆర్కేకు మద్దతుగా వైసీపీకి రాజీనామాలు చేసేందుకు పలువురు నేతలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై వైసీపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.