Telangana: చంద్రబాబుకు ఫోన్ చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి!
- తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
- ఈ నెల 22న జరగనున్న ఎన్నిక
- ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ఈరోజు ఫోన్ చేశారు. త్వరలో తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తెలంగాణలో 4 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 5 వరకూ దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.
అనంతరం ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫలితాలను మరో నాలుగు రోజుల తర్వాత అంటే మార్చి 26న ప్రకటిస్తారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య టీడీపీ టికెట్ పై గెలుపొందారు. కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.