Bollywood: ముంబయి ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
- అప్రమత్తమైన భద్రతా బలగాలు
- అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు
- బెదిరింపు కాల్ అని నిర్ధారణ
బాలీవుడ్ సినీ తారలు, వ్యాపారవ్తేతలు, ఇతర సెలబ్రిటీలతో నిత్యం రద్దీగా ఉండే ముంబయి ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విమానాశ్రయ వర్గాలకు ఉదయం 11 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. మరో 12 గంటల్లో ఇంటర్నేషనల్ టెర్మినల్ లో పేలుడు సంభవిస్తుందన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం.
ఈ కాల్ వచ్చిన వెంటనే ఎయిర్ పోర్టులోని కొంత భాగంలో అత్యవసర పరిస్థితి విధించారు. భద్రతా బలగాలు ఎయిర్ పోర్టులోని టెర్మినల్-2లో అణువణువును శోధించాయి. దానికి సమీపంలో ఉన్న ఎయిర్ లైన్స్ కార్యాలయాలను, ప్రీ డిపార్చర్ ఏరియాను, విజిటర్స్ ప్రయాణికులను కలిసే ప్రదేశాన్ని ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. అయితే బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులుగా ముంబయి ఎయిర్ పోర్టులో మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కార్యకలాపాలు నిలిపివేశారు. దాంతో ప్రయాణికుల సమ్మర్ధం కూడా పెద్దగా లేదు.