TRS: ఎవరుంటారు? ఎవరు పోతారు?... తెలంగాణ కాంగ్రెస్ అత్యవసర సమావేశం!
- నేడు అసెంబ్లీలో సీఎల్పీ భేటీ
- ఎమ్మెల్యేలను కొంటున్నారన్న ఉత్తమ్
- చట్టపరంగా పోరాడుతామని హెచ్చరిక
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించిన వేళ, కాంగ్రెస్ కు తీవ్రమైన షాకిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
తమ ఎమ్మెల్యేలను కొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని గత రాత్రి ఆరోపించిన ఆయన, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అందుకోసం తాము చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ తో ఎవరుంటారో, ఎవరు పోతారో చెప్పలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించిన ఆయన, ఫిరాయింపు రాజకీయాలను స్వయంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, దానికి 'అభివృద్ధి కోసం' అని పేరు పెట్టడం అత్యంత దారుణమైన విషయమని అన్నారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడం, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఐదేళ్ల కాలం గడపడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.