Ravindra Jadeja: మాయ చేసిన రవీంద్ర జడేజా... కొత్త రికార్డు!
- 84 సెకన్లలో ఆరు బంతులు
- 2 నిమిషాల్లోపే ఓవర్ ముగింపు
- బౌలింగ్ వేగంతో రికార్డు
మామూలుగా ఓ ఫాస్ట్ బౌలర్ ఒక ఓవర్ ను బౌలింగ్ చేయడానికి సుమారు 5 నిమిషాల సమయం పడుతుంది. అదే స్పిన్నర్ అయితే మూడు నుంచి 4 నిమిషాల సమయం అవసరం. ఇక నిన్న విశాఖపట్నం వేదికగా, భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన తొలి వన్డే పోరులో భారత స్పిన్నర్ జడేజా, తన బౌలింగ్ వేగంతో రికార్డు సృష్టించారు.
ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న వేళ, 16వ ఓవర్ ను వేసిన జడేజా, కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ఆరు బాల్స్ వేశాడు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 84 సెకన్లలో ఆ ఓవర్ పూర్తయింది. అంటే జడేజా వేసిన వేగంతో బంతులేస్తే, 50 ఓవర్ల ఆటను గంటా 10 నిమిషాల్లో ముగించేయచ్చు. అంటే టీ-20లో 20 ఓవర్లు వేసేందుకు ఇచ్చే సమయం కన్నా తక్కువన్నమాట. మామూలుగా అయితే, 50 ఓవర్ల ఆటకు సుమారుగా 201 నిమిషాలు పడుతుంది. తన బౌలింగ్ మాయతో వేగంగా బంతులేసిన జడేజా, మిగతా ఓవర్లను 2 నుంచి 4 నిమిషాల మధ్య ముగించాడు.