Chandrababu: టీడీపీకి గుడ్ బై చెప్పనున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల... వైసీపీలోకే!
- చంద్రబాబుతో సమావేశానికి గైర్హాజరు
- మోదుగులపై ఎంపీ గల్లా ఫిర్యాదు
- ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్న బాబు
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారా? జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మోదుగుల, నిన్న చంద్రబాబు గుంటూరు ఎంపీ స్థానంపై నిర్వహించిన సమీక్షకు డుమ్మా కొట్టారు.
త్వరలో రానున్న ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరికి సీట్లు ఇవ్వాలన్న విషయమై సమీక్ష జరుగుతున్న వేళ, మోదుగుల గైర్హాజరు కావడం గమనార్హం. ఈ సమావేశానికి హాజరైన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం ఇటీవలి కాలంలో మోదుగుల వైఖరి పార్టీకి నష్టం చేస్తోందని ఆరోపించినట్టు తెలుస్తోంది.
ఇక టీడీపీ ఎమ్మెల్యేలతో తాను విడిగా సమావేశం అవుతానని, ఆపై ఎవరు ఎక్కడి నుంచి పోటీ పడే అంశాన్ని పరిశీలిద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటానని, గెలిచే వారికి మాత్రమే టికెట్లను ఖరారు చేస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక టీడీపీకి దూరం కావాలని భావిస్తున్న మోదుగుల, వైకాపాలో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.