Mancherial District: మంచిర్యాలకు గోదావరి గలగలలు.. నీరు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
- పరీవాహక ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు
- మహా శివరాత్రి స్నానాల కోసం
- ఏటా భారీ సంఖ్యలో భక్తుల పుణ్యస్నానాలు
మహా శివరాత్రి పుణ్యస్నానాల కోసం తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిలోకి కొద్దిమేర నీటిని విడుదల చేసింది. ఏటా శివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి భోళాశంకరునికి ప్రీతిపాత్రమైన సోమవారం రావడంతో భక్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం గోదావరి నదిలో నీరు పూర్తిగా అడుగంటడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నదిలోకి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. దీంతో భక్తులు స్నానాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. కాగా, ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పరీవాహక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఒకేసారి పెద్దమొత్తం వరద వస్తుందని, నదిలో ఉన్న వారు ఒడ్డుకు చేరాలని ప్రచారం చేస్తున్నారు.