India: నినాదాలు చేయడం కాదు... చిత్తశుద్ధి ఉంటే సైన్యంలో చేరండి: ఓ అమరవీరుడి భార్య సూచన
- జిందాబాద్, ముర్దాబాద్ అంటే ఉపయోగం ఏముంది?
- దేశభక్తి ఉంటే సైన్యంలో చేరాలి
- కనీసం మీ కుటుంబ సభ్యులనైనా ప్రోత్సహించాలి
కొన్నిరోజుల క్రితం మధ్య కశ్మీర్ ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు సిబ్బంది దుర్మరణం పాలవడం తెలిసిందే. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ నినాద్ మందావ్ గనే కూడా ఉన్నారు. ఆయన మృతదేహానికి శుక్రవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో నాసిక్ లోని అమర్ ధామ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ "అమర్ రహే అమర్ రహే వీర్ జవాన్ అమర్ రహే", "భారత్ మాతా కీ జై", "వందేమాతరమ్", "ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్థాన్ ముర్దాబాద్..." వంటి నినాదాలతో హోరెత్తించారు స్థానికులు. దీనిపై నినాద్ మందావ్ గనే భార్య విజేత అసహనం వ్యక్తం చేశారు.
ఇలాంటి నినాదాల వల్ల ఉపయోగం ఉండదని, ఎవరైనా దేశభక్తి ఉన్నవాళ్లు త్రివిధ దళాల్లోకి వెళ్లి సేవలు అందించడం మేలని సూచించారు. "జిందాబాద్, ముర్దాబాద్ అంటూ అరవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏదైనా చేయాలనుకుంటే రక్షణ దళాల్లో చేరండి... లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేరేలా ప్రోత్సహించండి. అదికూడా సాధ్యం కాకపోతే... మీకు తోచిన రీతిలో సామాజిక సేవ చేయండి. చెత్తను బయటపారబోయడం, బహిరంగ మూత్రవిసర్జనను నివారించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, మహిళలపై వేధింపులకు దూరంగా ఉండడం, మత విద్వేషాన్ని వ్యాప్తి చేయకపోవడం వంటి అంశాలపై దృష్టిపెట్టండి. ఇలాంటి చిన్న చిన్న అంశాలే చాలా మార్పును తీసుకువస్తాయి" అంటూ విజేత హితవు పలికారు.