airforce: వింగ్ కమాండర్ అభినందన్ హెల్త్ రిపోర్ట్
- అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు
- వెన్నెముక కింది భాగంలో చిన్నపాటి గాయం
- ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రి వైద్యుల వెల్లడి
పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 జెట్ ను కుప్పకూల్చి, పాక్ ఆర్మీ కస్టడీలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి, భారత జవాను దమ్ము ఏమిటో ప్రపంచానికి చూపించిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ను వైద్యులు పరీక్షించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు తేల్చారు. అయితే వెన్నెముక దిగువన ఆయనకు చిన్నపాటి గాయమైనట్టు స్కానింగ్ లో తేలిందని వెల్లడించారు. ఆయన ప్రయాణిస్తున్న మిగ్-21కు జరిగిన ప్రమాదంలో అభినందన్ కు ఈ గాయమైనట్టు తెలిపారు. అభినందన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు.
ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో అభినందన్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అభినందన్ ను అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ... అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి ఆయనను భారత్ కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ కూడా అభినందన్ ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. అభినందన్ అనే పదానికి అర్థం మారిపోయిందని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న అభినందన్ ను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ పరామర్శించారు.