Pakistan: పాక్ కు సంబంధించి బీసీసీఐ విన్నపాన్ని తిరస్కరించిన ఐసీసీ
- ఐసీసీ త్రైమాసిక సమావేశంలో పాక్ అంశంపై చర్చ
- బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయలేమన్న ఐసీసీ
- అన్ని దేశాలు క్రికెట్ ఆడటమే ఐసీసీ లక్ష్యమని వ్యాఖ్య
పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ను పక్కన పెట్టాలంటూ ఐసీసీకి బీసీసీఐ విన్నవించిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టులకు మద్దతు పలుకుతున్న దేశాలతో తెగదెంపులు చేసుకోవాలని కోరింది. అయితే బీసీసీఐ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించినట్టు సమాచారం. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో కథనం మేరకు, నిన్న జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశం ముగింపు సందర్భంగా... ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఈ అంశంపై చర్చించారు. బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయడం సాధ్యం కాదని నిర్ణయించారు.
ఐసీసీ బోర్డులో బీసీసీఐ యాక్టింగ్ సెక్రటరీ అయిన అమితాబ్ చౌధురి ఈ సమావేశానికి బీసీసీఐ లేఖను తీసుకురాలేదు. అయినా, శశాంక్ మనోహర్ ఈ అంశాన్ని స్వయంగా లేవనెత్తి చర్చించారు. అన్ని దేశాలు క్రికెట్ ఆడటమే ఐసీసీ ప్రథమ లక్ష్యమని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.